20, మార్చి 2012, మంగళవారం

తేనెవాక


 సీ||       అమ్మపాల రుచుల కమ్మదనము తోడ
                      ఆత్మ నింపిన భాష ఆంధ్ర భాష !
      వీనులవిందుగా వినిపించు లాలితో
                      అమ్మ పాడిన భాష ఆంధ్ర భాష !
   ఊయల తొట్టెలో ఊకొట్టు నాతోడ
                      అమ్మ పల్కిన భాష ఆంధ్ర భాష !
          అత్త తాతయనుచు  ఆదిగురువగుచు
                      అమ్మ చెప్పిన భాష ఆంధ్ర భాష !

 తే||     నడక నేర్వని పూర్వమే నన్ను పిలచి
          ఎత్తి ముద్దాడి గుండెకు హత్తుకొనుచు
 అత్తపెట్టిన ముద్దరా ఆంధ్ర భాష
                అమృతమునకన్నమిన్న నా ఆంధ్ర భాష ! 

సీ||    సంస్కృత భాషతో సమమైన భాషగా 
                    విఖ్యాతమైనట్టి విమలచరిత !
                  ప్రాకృతంబును మించి ప్రాభవోన్నతిగూర్చి  
                       రాజులు పెంచిన రమ్య లతిక ! 
           శబ్దశాసనునింట చతుర్యమున్నేర్చి
                       శేముషింబొందిన చిన్మయాంగి !
     ఉభయభాషా ప్రవీణోద్దండు గేహాన 
                     నడకలు నేర్చిన నవవధూటి !

తే||          పోతనార్యుడు ప్రేమతో పోసినట్టి 
                  హరికథామృతపానమ్ము పరగజేసి 
                    అవని నాలుగు చెరగుల అమలమైన
                              వెలుగుజిలుగులు నింపె నా తెలుగు భాష !

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి